Tuesday, 23 February 2021

అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు పాక్షికంగా కానీ పూర్తిగా గాని ఎందుకు అమ్మాలి?

అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు పాక్షికంగా కానీ పూర్తిగా గాని ఎందుకు అమ్మాలి?

ఒక విశ్లేషణ ..

ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ప్రజల టాక్స్ సొమ్ములు ఖర్చు చేసి స్థాపిస్తారు. అలా పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వానికి తగిన ఆదాయం రావాలి. అంటే ఆ సంస్థలు సంపాదించిన ఆదాయంలో ఆ సంస్థల ఖర్చులు అంటే ఉద్యోగుల జీతాలు , విద్యుత్, నిర్వహణా ఖర్చులు పోనూ మిగతా ఆదాయం ప్రభుత్వానికి ఇస్తే ప్రజల టాక్స్ సొమ్ము దాని మీద ఖర్చు చేసినందుకు ఆ ప్రజలకు పరోక్షంగా ఆదాయం వచ్చినట్లు..అంటే అలా వచ్చే ఆదాయాల వల్ల ప్రభుత్వం ప్రజల మీద టాక్స్ భారం తక్కువ వేయవచ్చు లేదా ఆ డబ్బులు సంక్షేమ పథకాలకు, మౌలిక సదుపాయాల అంటే రోడ్లు విద్యుత్ మొ. వాటికి ఖర్చు చేయవచ్చు.

అలా కాక కనీసం ఆ సంస్థలు తమ ఖర్చులకు తగ్గ ఆదాయం ప్రతీ సం. సంపాదించగలిగితే  ప్రభుత్వం స్థాపించిన సంస్థల వల్ల పోనీ ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా కనీసం కొంత మందికి ఉపాధి చూపిస్తున్నాయి అని సరి పెట్టుకోవచ్చు. అలాగ కూడా  కాక ఆ ప్రభుత్వ సంస్థ ఆదాయం దాని ఖర్చులకు, జీతాలకు కూడా చాలకపోతే? మళ్లీ ప్రతీ సం. బడ్జెట్ నుండి అంటే ప్రజల దగ్గర వసూలు చేస్తున్న టాక్స్ మొత్తము లోంచి నిధులను ఈ సంస్థలను పోషించడానికి అంటే వాటి ఉద్యోగుల జీతాలకు ఇతర ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చెయ్యాలి.  అంటే ఈ నిధులు వాటికి ఇవ్వడానికి కొత్త అప్పులు చేయడమో లేక ప్రజలపై టాక్స్ లు పెంచడమో కొత్త టాక్స్ లు వేయడమే చేయాలి. లేకపోతే ప్రభుత్వానికి మాత్రం వీటికి ఇవ్వడానికి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి?

ఇలా ఎన్ని సం.లు కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థలు నడవడానికి డబ్బులు సాయం చేస్తూ ఉండాలి? చెప్పలేం. కారణం మళ్ళీ ఆ సంస్థలు లాభాల బాట పట్టే దాకా చెయ్యాలి. ఎప్పుడు లాభాల బాట పడతాయి? అదీ చెప్పలేం అంతర్జాతీయ, దేశీయ ఆర్ధిక పరిస్థితులు, ఆ సంస్థ తయారు చేస్తున్న వస్తువులు/సేవల నాణ్యత, ప్రజల అవసరాలు, అభిరుచుల్లో మార్పు, టెక్నాలజీ లో మార్పులు  ఇలా చాలా చాలా విషయాలు మీద ఆధార పడి ఉంటుంది.

ఎప్పటికి ఇక లాభాలు రాని సంస్థలను?
పూర్తిగా గాని పాక్షికంగా కానీ ఆ సంస్థ వాటాలు అమ్మి వాటి అప్పులు తీర్చి ఆ సంస్థను గాడిలో పెట్టడం. లేదా ఆ సంస్థలు ఇక గాడిలో పెట్టినా మారిన టెక్నాలజీ లేదా  మార్కెట్ లేదా ప్రజల అవసరాల/అభిరుచుల మార్పుల దృష్ట్యా  మళ్లీ ఒకటి రెండు సం. లలో ఆ సంస్థలు నష్టాల బాట పడతాయి అని అంచనా వేసినప్పుడు వాటిని ప్రభుత్వం పూర్తిగా అమ్మి ఆ డబ్బులు ఏవైనా  లాభదాయకంగా కొత్త సంస్థలలో మదుపు చేరడం చేయవచ్చు. దాని వల్ల ప్రభుత్వానికి అనవసర ఖర్చు తగ్గడమే కాక ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

1999లో వాజపేయి గారు ప్రధానిగా వచ్చేసరికి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. చాలా సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. గతంలోనే కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ సంస్థ(SAIL)  స్టీల్ అథారిటీ ఇండియాలో కొంత భాగం అమ్మినా షేర్ మార్కెట్ లో ఆ షేర్ కొన్న మదుపుదారులు లాభపడకపోగా నష్టపోయారు.

అదే టైం లో వాజపేయి గారి ప్రభుత్వం వచ్చింది. వారు హిందూస్తాన్ జింక్, మారుతి లో కొంత వాటా అమ్మకానికి పెట్టారు. స్టాక్ మార్కెట్ లో ఆ షేర్లు కొన్న మదుపర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ కంపిణీలలో ఉన్న ప్రభుత్వ వాటా చాలా ఎక్కువ పెరిగింది. ఇలా పబ్లిక్ సంస్థ షేర్స్ మంచి లాభాలు ఇవ్వడంతో అదే నమ్మకంతో మదుపరులు అప్పటికే స్టాక్ మార్కెట్ లో గల మిగతా పబ్లిక్ సెక్టర్ షేర్లు అంటే సెయిల్ వంటివి కొనడం ప్రారంభించారు. దానితో పబ్లిక్ సెక్టర్ సంస్థల షేర్ల విలువ, తద్వారా ఆ సంస్థల మొత్తం విలువ పెరగడం ప్రారంభం అయింది.

స్టాక్ మార్కెట్ మదుపరులకు లాభాలు తెచ్చి పెడుతోందా? నష్టాలు తెచ్చిపెడుతోందా? అని కొలవడానికి రక రకాల పద్దతులు అనుసరిస్తారు. వాటిల్లో ఒకటి వర్గాల వారీగా షేర్లు విభజించి అంటే బాంక్ ల షేర్లు(బాంక్ ఇండెక్స్ అంటారు), లోహాల షేర్లు, ఫార్మా షేర్లు, ఐటి షేర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు షేర్లు ఇలా  విడగొట్టి చూసి ఏ వర్గ షేర్లు ఎంత మేర మదుపరులకు లాభాల్ని సంపాదించి పెడుతున్నాయో చెప్తారు. అంతేకాక బాంబే స్టాక్ ఎక్స్చేంజి లో ముఖ్యమైన 500 షేర్లు తీసుకొని ఆ గ్రూప్ పనితనాన్ని అంచనా వేస్తారు. దానినే BSE500 ఇండెక్స్ అంటారు. ఇది మొత్తం బాంబే స్టాక్ ఎక్స్చేంజి పని తీరుని కొలిచే కొలబద్ధగా చెప్పుకుంటారు.

ఈ ఉపోద్ఘాతం ఎందుకు అంటే 1999-2004 మధ్య వాజపేయి ప్రభుత్వం ఉండగా ఈ BSE 500 ఇండెక్స్ 70% పెరిగింది అంటే మదుపరులకు 70%లాభాలు ఇచ్చింది. కానీ అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు షేర్ ఇండెక్స్ 300% పెరిగింది. అంటే 1999లో ఒకరు మిగతా షేర్లు లో ఒక వెయ్యి రు.పెడితే 2004కి అతనికి ఆ వెయ్యి ₹1700 అయింది. కానీ అదే వెయ్యి అతను PSU షేర్స్ లో పెట్టి ఉంటే ₹3000 అయ్యింది. అంటే వాజపేయి సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పనితీరు మీద మదుపరులకు బాగా విశ్వాసం పెరిగింది అన్న మాట.

సరే ! 2004 లో పెద్దగా చదువు లేని వాజపేయి గారు దిగి పోయి గొప్పగా ఆర్థిక శాస్త్రము చదివిన, ఇంతకు ముందే దాదాపు అన్ని ప్రభుత్వ అత్యుత్తమ ఆర్ధిక పదవుల్లో పని చేసిన అనుభవం గల మన్మోహన్ గారు ప్రధాని గా అయ్యారు. అదే PSU షేర్లు పరిస్థితి చూడండి. UPA-1 కాలంలో BSE 500 ఇండెక్స్ 120% లాభాలు ఇస్తే PSU ఇండెక్స్ 60%మాత్రమే లాభాలు ఇచ్చింది. అదే UPA-2 లో పరిస్థితి మరీ ఘోరం. మన్మోహన్ ప్రభుత్వం మరిన్ని అంటే సుమారు 30 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు అమ్మినా (మోడీ అన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తున్నాడు అనే ఆరోపణలు పై మరియు మన్మోహన్ అమ్మేసిన సంస్థలు ఈ రెండింటి సమాచారం తో నేను వేరే పోస్ట్ పెడతాను) PSU ఇండెక్స్ లాభాలు ఇవ్వకపోగా 6% నష్టాలు మిగిలిచింది మదుపరులకు. కానీ BSE500 ఇండెక్స్ 73%లాభాలు పంచి ఇచ్చింది. అంటే  2009 లో ఒకరు BSE500 ప్రకారం వెయ్యి మదుపు మీద 2014 సరికి  ₹1730 అయితే, PSU ఇండెక్స్ లో 2009 లో పెట్టిన వెయ్యి 2014 కి ₹940 అయిపోయింది. అంటే ప్రభుత్వ సంస్థల షేర్లు విలువ, మొత్తం మార్కెట్ విలువ పెరగక పోగా తగ్గిపోయింది అని అర్ధం.

అందుకే 2014 తరువాత ఈ PSU షేర్ల విలువ ఇంకా ఇంకా తగ్గిపోతూ వస్తోంది. ఈ 6 సం.లలో PSU ఇండెక్స్ 36%పడిపోయింది.

మరి దీని వల్ల ఏమిటి నష్టం? షేర్ మార్కెట్ లో మదుపుదారులు ఏ సంస్థ షేర్అయినా లాభాలు  తెస్తుంది అనే నమ్మకం ఉంటేనే షేర్లు కొంటారు. లేకపోతే కొనరు. అంటే మోడీ ప్రభుత్వం ఒక వేళ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొంత శాతం వాటాలు అమ్ముదాం అనుకుంటే మార్కెట్ లో ఆ షేర్స్ కొనే వాళ్ళు లేక షేర్ కి విలువ పెరగదు. ప్రభుత్వం డిజ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అంటే ప్రభుత్వ సంస్థలలో కొంత వాటా అమ్మి డబ్బు సంపాదించి ఆ సంస్థలను తిరిగి లాభాల బాటలో పెట్టాలి అన్నా లేదా పూర్హిగా అమ్మి నష్టాలు తగించుకోవాలి అనే ప్రణాళికలు అమలుకు నోచుకోవు. అంతే కాక ఈ ప్రభుత్వ సంస్థల మార్కెట్ విలువ కూడా తగ్గిపోతుంది

అందువల్ల మోడీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ వాటాలు అమ్మి  నష్టాల నుండి కొన్నింటిని కొంత బయట పడేద్దాం అని ప్రణాళికలు వేసుకున్నా అమలు చేయలేకపోతున్నాది.  ఎందుకంటే షేర్ మార్కెట్ లో ఈ షేర్లు అంటే పెద్దగా ఆసక్తి ఉండకపోవడంతో మదుపరులు ఈ షేర్స్ పెద్ద మొత్తంలో కొనరు, ప్రభుత్వానికి డబ్బులు రావు, డబ్బులు వస్తే కాస్త బాగున్న సంస్థల వంటి వాటిని (అంటే LIC, BPCL వంటివి)మళ్ళీ గాడిలో పెట్టి , మార్కెట్ లో ఈ షేర్ కోట్ అవుతుంది కాబట్టి సంస్థలో/ఉద్యోగుల్లో పోటీ తత్వం పెంచవచ్చు..

కానీ మదుపరులు ఇలా కాస్త లాభంగా ఉన్న షేర్లు పైనే ఆసక్తి చూపిస్తారు కానీ నష్టాలు వస్తున్న సంస్థల షేర్లపై ఆసక్తి చూపరు. అందుకే ప్రభుత్వం కాస్తా లాభాలు సంపాదిస్తూ ఉన్న సంస్థలలోనే తన వాటా పాక్షికంగా కానీ పూర్తిగా గాని అమ్మడానికి ప్రయత్నించగలదు. నష్టాల్లో ఉన్న సంస్థల షేర్లు ప్రీమియం పెట్టి అమ్మే అవకాశం ఉండదు. ఎందుకంటే వాటిని కొనడానికి ఎవరూ ఆసక్తి చూపించరు కాబట్టి.  పోనీ ఆ షేర్లు తక్కువ ధరకు అమ్మితే మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ  సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతోంది అని అప్రతిష్ట మూట కట్టుకుంటుంది

అందువల్ల ఈ డిజ్ ఇన్వెస్ట్మెంట్ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు అమ్మడం అన్న ప్రక్రియ ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పి. పోని అలాగే నష్టాల్లో నడిపిద్దాం అంటే  తెల్ల ఏనుగును భరిస్తున్నట్ల ఎన్ని సంవత్సరాలు భరించగలదు?

మోడీ ప్రభుత్వం మళ్ళీ లాభాల్లో ఉన్న కొన్ని ప్రభుత్వ సంస్థల షేర్లు పాక్షికంగా అమ్ముదాం అని నిర్ణయం తీసుకోవడంతో ఈ ఫిబ్రవరి నెలలో PSU ఇండెక్స్ 42% వృద్ది నమోదు చేసుకున్నాయి.  అందుకే మార్కెట్ ఇలా పాజిటివ్ గా ఉన్నప్పుడే ప్రభుత్వం PSU షేర్లు అమ్మగలదు.

....చాడా శాస్త్రి....

Saturday, 23 January 2021

టాటా నానో పరిశ్రమ - సింగూర్ నష్టం - సానంద్ లాభం

పెద్ద పోస్ట్, పూర్తిగా చదవండి. విస్తృతంగా షేర్ చేయండి

టాటా మోటార్స్ 2006 సం. లో పశ్చిమ బెంగాల్ లో సింగూర్ వద్ద మధ్య తరగతి ప్రజలకు ఒక లక్ష రూపాయల కు లభ్యం అయ్యే విధంగా నానో కారును తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టి 2008 నాటికి ఫ్యాక్టరీ నుండి మొదటి కారు బయటకు రావాలని లక్ష్యంగాపెట్టుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు సైట్లలో టాటా కంపెనీ సింగూర్‌ను ఎంపిక చేసింది. ఫ్యాక్టరీ నిర్మించడానికి కావలసిన 997 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి 2006లో సేకరించింది. దానికి ఫెన్సింగ్ వేసింది. గొడవలు జరగ కుండా ఫెన్సింగ్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను,  సీపీఎం పార్టీ తమ కార్యకర్తలును కాపలాగా పెట్టారు

భూములు కోల్పోతున్న రైతుల నుండి భారీ వ్యతిరేకత ఎదురైంది.  ఈ రైతులకు అప్పటి ప్రతిపక్ష నాయకురాలు మమతా బెనర్జీ రాజకీయ మద్దతు ఇచ్చారు. ఉద్యమానికి మేధా పట్కర్ , అనురాధ తల్వార్, అరుంధతి రాయ్, కలకత్తా వామపక్ష మేధావులు అమర్త్య సేన్, అపర్ణ సేన్, కౌశిక్ సేన్, షావోన్లీ మిత్రా, సువప్రసన్న కూడా మద్దతు ఇచ్చారు. 

భూమిలేని రైతులకు వ్యవసాయ భూమిని వాగ్దానం చేయడం ద్వారా వామపక్ష నాయకులు అధికారాన్ని సంపాదించారు. కాని పశ్చిమ బెంగాల్ జనాభా సాంద్రత దృష్ట్యా, భూములు చిన్నవి కావడంతో పేద కుటుంబాలను పైకి తీసుకురావడానికి వాటిలో వచ్చే దిగుబడి సరిపోదు. వ్యవసాయం నుండి పారిశ్రామిక ఉద్యోగాలకు మళ్లించడానికి తగ్గ పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. వామపక్ష మద్దత్తు గల యూనియన్స్ పారిశ్రామిక యజమానుతో వ్యవహరిస్తున్న తీరు వల్ల కొత్త పరిశ్రమలు రావడం లేదు.

టాటా ప్రాజెక్టు కోసం అనేక ఇతర రాష్ట్రాలు టాటా మోటార్స్‌కు భూమిని ఇస్తాం అని ముందుకు వచ్చాయి. కానీ పైన చెప్పిన కారణాలు గుర్తించిన వామపక్ష ప్రభుత్వం టాటా వాళ్ళు ఇక్కడ పరిశ్రమ పెడతాము అంటే భూ సేకరణ చేసి మిగతా ఆటంకాలు లేకుండా చూస్తామని టాటా కంపనీకి హామీ ఇచ్చారు.
టాటా కంపనీ తాము కార్ల పరిశ్రమ ప్రారంభిస్తే తమతో పాటు మరో 70 సంస్థలు కూడా ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తారు, వెయ్యి కోట్ల పెట్టుబడులు వచ్చి ఇది దేశంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు అవుతుంది అని చెప్పింది.

అందుకే వామపక్ష ప్రభుత్వం ఇక్కడ  భూమిలో ఉంటున్న ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించింది. ఇచ్చిన పరిహారం సరిపోదని,
కొత్త గృహ సౌకర్యాలు ఆలస్యం అయ్యాయి అని ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుండే వివాదాన్ని సృష్టించింది. ప్రత్యేకించి ప్రైవేటు సంస్థల కోసం సారవంతమైన వ్యవసాయ భూమిని రాష్ట్రం స్వాధీనం చేసుకోవడంపై ఆందోళనలు రేగాయి.

విచిత్రం ఏమిటంటే ఇటువంటి ఆందోళనకు ఎప్పుడూ ముందు ఉండే CPM ఈ ఆందోళనలను తమ ప్రభుత్వ దమన నీతితో అణిచివేయడానికి ప్రయత్నించడమే కాదు CPM కార్యకర్తలు ఆందోళన కారులపై దాడులు వంటివి కూడా చేశారు. అంతే కాదు అక్కడ సిపిఎం నాయకులు ఆందోళన కారుల్లో స్త్రీలను రేప్ చేశారు అని ఆరోపణలు వచ్చాయి. ఈ రేప్ ఆరోపణల మీద థేబు మాలిక్, సుహిద్ దత్తా అని ఇద్దరు సీపీఎం నాయకులను సీబీఐ అరెస్టు చేసింది.  ఈ ఉద్యమంలోకి నక్సల్స్ ప్రవేశించారు అని కూడా CPM ఆరోపించింది. 

అక్టోబర్ 3వ తేదీన టాటా కంపనీ సింగూర్ ప్రాజెక్ట్ ఆపేస్తున్నట్లు, తమ నానో కార్ల ఉత్పత్తి గుజరాత్ రాష్ట్రంలో సానంద్ వద్ద పెడతాం అని అధికారంగా ప్రకటించింది.

కొందరు ఉద్యమ వేత్తలు కోర్టుకు కూడా పోయారు.   టాటా మోటార్స్ కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 997 ఎకరాల వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని 2016 లో సుప్రీంకోర్టు రద్దు చేసింది మరియు 9,117 మంది భూస్వాములకు భూములు తిరిగి ఇవ్వమని ఆదేశించింది. 

దాంతో సింగూర్ కధ కంచికి...😪

ఇక సానంద్ కధ:

ఎప్పుడు అయితే టాటా బెంగాల్ నుండి తమ పరిశ్రమ తరలిద్దాం అని అనుకుందో వెంటనే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ మా రాష్ట్రానికి రండి ఏ గొడవలు లేకుండా ఒక సం. లోపు మీరు కార్ల ఉత్పత్తి ప్రారంభించవచ్చు అని హామీ ఇచ్చి టాటా నానో కంపనీ తమ రాష్ట్రానికి తరలించుకు పోయారు. 

సానంద్ గుజరాత్ లో అహమ్మదాబాద్ దగ్గర ఉంది. అక్కడ మరి భూసేకరణ సమస్య రాలేదా? వచ్చింది.  అక్కడ 6 గ్రామాల్లో 1100 ఎకరాలు స్వాధీనం చేసుకుంటాం అని ప్రభుత్వం ప్రకటించింది. మూడు వేల మంది రైతులు గొడవ చేస్తే వారితో చర్చలు జరిపి ప్రస్తుత మార్కెట్ రేట్ కి నాలుగు రెట్లు పరిహారం ఇస్తాము అని నచ్చచెప్పడంతో రైతులు ఉద్యమం విరమించారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టినా వారు వీరి వలలో పడలేదు. టాటా భూమి ఖరీదులో మూడు వంతులు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం మిగతా పావు వంతు భరించింది.

 ఉత్పత్తి అనుకున్న సమయానికి ప్రారంభించడానికి కావలసిన అన్ని అనుమతులు, సదుపాయాలును మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జూన్ 2010 అంటే రికార్డ్ టైం లో ఒక్క 14 నెలల్లో ప్యాక్టరీ నుండి మొదటి కారు బయటకు వచ్చింది. ఈ ఫ్యాక్టరీ ప్రత్యక్షంగా 1200 మందికి, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి చూపించింది. అక్కడ ఈ ఫ్యాక్టరీలు వల్ల ఎటువంటి కాలుష్యం రాకుండా అక్కడి గ్రామ ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడంతో  స్థానికుల నుండి ఆ తరువాత కూడా ఏ వ్యతిరేకత రాలేదు.

టాటా పరిశ్రమ అక్కడ విజయవంతంగా ప్రారంభం కావడంతో కొత్త ఆటోమొబైల్ పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు కూడా 
అక్కడకు వచ్చాయి. ఇప్పుడు సానంద్ లో

1. టాటా
2. ఫోర్డ్
3.హ్యుందాయ్
4. హీరో హోండా
5. హొండా కార్
6. హితాచి
7. జనరల్ ఎలక్ట్రికల్స్
8. కాడిలా హెల్త్ కేర్
వంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కాకుండా ఇంకా చాలా చిన్న పరిశ్రమలు వచ్చాయి. స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల్లో భూ ధరలు విపరీతంగా పెరిగాయి.
అక్కడ రైతులు ఆకస్మికంగా కోటీశ్వరులు అయిపోయారు. ఎకరా 3/4లక్షలు కంటే పలకని ధర నుండి ఇప్పుడు ఎకరా కనీసం కోటి రూపాయలు పైనే పలుకుతోంది.

https://m.rediff.com/news/slide-show/slide-show-1-gujarat-election-sanands-overnight-crorepatis-are-all-for-modi/20121203.htm

అటువైపు సింగూర్ లో రైతులు ఇప్పటికి అదే దుర్భర దారిద్ర పరిస్థితులు అనుభవిస్తున్నారు. తమను రెచ్చగొట్టిన రాజకీయ నాయకులను తిట్టుకుంటున్నారు.

అన్నిటికంటే దారుణం ఏమిటంటే రైతులను రెచ్చగొట్టిన మమత ముఖ్యమంత్రి అయిపోయింది, అమర్త్య సేన్ లు, మేధాపాట్కర్ లు, అరుంధతి రాయ్ లు, అపర్ణ సేన్ లు మళ్ళీ సింగూర్ పోలేదు. వారు హాయిగా విమానాల్లో తిరుగుతూ విదేశీ విహారాలు చేస్తూ, అంతర్జాతీయ అవార్డులు కొట్టేస్తూ, పత్రికల్లో బీదవారు గురించి వ్యాసాలు రాస్తూ, ఉపన్యాసాలు చెపుతూ లక్షల్లో గడిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతూనే వున్నారు. ఇప్పుడు ఈ మేధావి ఉద్యమకారులు సింగూర్ పోతే ప్రజలు తరిమి తరిమి కొడతారు.

గుజరాత్ అభివృద్ధి చెందుతోంది అంటేఅక్కడ వామపక్ష పార్టీల ప్రభావం తక్కువ ఉండడం వల్ల  ప్రజల్లో కూడా ప్రతీదీ వ్యతిరేకించాలి అనే ఆలోచనా ధోరణి కూడా తక్కువ ఉంది.

...చాడా శాస్త్రి..

చిత్రాలు: గూగుల్ సౌజన్యం
                             సింగూర్ - సానంద్

Tuesday, 19 January 2021

ట్రంప్ - చెత్త ప్రెసిడెంటా?

అందరి అమెరికా అధ్యక్షుల్లో #డోనాల్డ్_ట్రంప్ చెత్త అధ్యక్షుడు అని చెప్పడానికి గల కారణాలు :

1. చర్చలు జరిపి ఉత్తర కొరియా అణ్వాయుధ ముప్పు తగ్గించడం

2. చైనా తో అమెరికాకు గల వాణిజ్య.లోటును తగ్గించి
చైనాతో సమం చెయ్యడానికి ప్రయత్నించడం.

3. ఇస్లామిక్ తీవ్రవాదం ముఖ్యంగా ఐ సీస్ మీద గట్టి చర్యలు తీసుకొని దానిని దాదాపు తుద ముట్టించి ప్రపంచ శాంతికి ప్రయత్నించడం

4. ఇజ్రాయెల్ మరియు  ఇస్లామిక్ గల్ఫ్ దేశాల మధ్య చర్చలు జరిగేలా చూసి ఈ దేశాల మధ్య శాంతి చర్చలు సఫలం కావడానికి కృషి చేయడం, దశాబ్దాలుగా వాటి మధ్య ఉన్న శత్రుత్వం తగ్గించడం

5. గత కొందరు అమెరికా ప్రెసిడెంట్స్ లాగా ఎదో కారణం చూపి ఎదో దేశం మీద దండెత్తి బాంబుల వర్షం కురిపించలేదు.

6. నాటో దేశాల రక్షణ విషయాలు వారే చూసుకోవాలి అన్నట్లుగా బడ్జెట్లో మార్పులు చెయ్యడం..

Saturday, 16 January 2021

సంక్రాంతి - పందాలు - విశిష్టత

సంక్రాంతి వచ్చింది అనే సరికి కోడి పందాలు మీద, ఎడ్ల బండీల పోటీలు, జల్లి కట్టు మొ. ఆటలు మీద విమర్శలు గుప్పిస్తూ రక రకాల కధనాలు వస్తుంటాయి. 

కానీ కాస్త ఆలోచించి చూస్తే నిజంగా ఇవి వినోదం పంచడం కోసమేనా ఊద్దేశించబడ్డాయి లేక ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే నాకు ఈ క్రింది విధంగా అనిపించింది.

నేడు హింస అనుకుంటున్నవి ప్రాచీన కాలంలో వాటి శరీర దారుఢ్యం పెంచడానికి ప్రారంభింపబడి ఉండవచ్చు.

ఎద్దులు పోతులు ఎంత బలిష్టంగా ఉంటే రైతులకు, గ్రామీణులకు అంత ఉపయోగం.
ఎందుకు అంటే అవి గంటల తరబడి అలసిపోకుండా పొలాలు దున్నడానికి, నూర్పులకు, నూనె గానుగలు, నీటి ఏతాములు తిప్పడానికి, పంటలను ఇతర సరుకులను బళ్లపై రవాణా చేయడానికి, మనుషులు బళ్ల మీద ప్రయాణించడానికి...ఇలా ఒకటి ఏమిటి ప్రాచీన మనిషి జీవితం అంతా వీటితో పెనవేసుకుపోయి ఉంటుంది.

వీటిని మరి బలిష్టంగా తయారు చేయడం ఎలా?  ఒక్క బలవర్ధకమైన ఆహారం పెడితే చాలదు. వాటిలో ఇంకా కష్టపడే తత్త్వం, పోరాట  పటిమ, పౌరుషం వంటి లక్షణాలు పెరిగితే దానికి అనుగుణంగా వాటి శరీరంలో రసాయనాలు హర్మోన్లు ఉత్పత్తి చెంది వాటి బ్రీడ్ బలిష్టంగా తయారు అవుతుంది. అలాగే వీటి ద్వారా జన్మ ఇచ్చిన ఆవులు,గేదెలు మొ. వి కూడా బలిష్టంగా ఆరోగ్యంగా జన్మించి అవి ఇచ్చే పాలు కూడా బలంగా ఆరోగ్యం పెంపొందించే విధంగా ఉంటాయి.

అలాగే పుంజులు, గొర్రె పోతులు కూడా. అవి ఎంత దృఢంగా ఉంటే కోడి, గొర్రెల జాతులు అంత ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. వాటి పాలు, గుడ్లు, మాంసం ఆహారంగా తీసుకునే వారికి కూడా ప్రకృతి సిద్ధమైన బలమైన ఆహారం లభిస్తుంది.

ఇటువంటివి  దృష్టిలో ఉంచుకొనే ఆ నాటి కాలంలో వీటిని ప్రవేశపెట్టి వుంటారు. మనుషులకు శరీర దారుఢ్యం పెరగడానికి, వారి జీన్స్ బలంగా ఆరోగ్యంగా తయారు అవడానికి మల్ల యుద్దాలు, కత్తులు తిప్పడాలు, సాము గరిడీలు, బరువులు ఎత్తడాలు ఎలాగో..ప్రవేశ పెట్టారో అలాగే వారి మధ్య పోటీలు ఎలా పెట్టారో ఈ జంతువులకు కూడా అదే దృష్టితో ఈ పోటీలు పెట్టి  ఉండ వచ్చు.

నేటి కాలంలో ఇటువంటి జంతువుల వంటి వాటికి బలం పెంచడానికి ఎన్నో దుష్ప్రభావాలు గల స్టెరాయిడ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్  ఇస్తున్నారు.
అవి తాత్కాలికంగా పని చేస్తాయి. కానీ తరువాత దీర్ఘ కాలంలో ఆ జంతువులకు వాటి ఉత్పత్తులను ఆహారంగా స్వీకరించిన వారికి కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది.

ఎన్నో సం. ల నుండి పేరెన్నిక గన్న మన ఒంగోలు గిత్తలు బ్రీడ్ కి, అలాగే గిర్ వంటి దేశీయ గో బ్రీడ్ లకు నేటికీ  ప్రపంచంలో గొప్ప గుర్తింపు ఉంది.

అయితే కాలక్రమేణా ఈ పోటీలు కూడా మిగతా ఆటలు పోటీలు లాగే  మార్పు చెందుతూ వెర్రితలలు వేస్తున్నాయి.

అందుకని వీటిని పూర్తిగా బాన్ చెయ్యడం దీర్ఘ కాలంలో దేశ పశుసంపదాభివృద్దికి ప్రమాదం. అందుకని ఇటువంటి ఆటలను పూర్తిగా నిషేధించకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ పర్యవేక్షణలో జరపాలి.

....చాడా శాస్త్రి...

Thursday, 14 January 2021

అంబానీ - ఆదాని- హిందూస్తాన్ లీవర్

 సోషల్  మీడియాలో ఉదయం లేస్తే అంబానీ ఆదానిని

తిడుతూ వందల పోస్టులు పెడుతున్నారు.

సరే...ఒక సారి ఇది చదవండి...

బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ  అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది. 


కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.


అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.


బాగా చదువుకున్న  వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.


ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు. 


కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo.  అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం. 


కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...


ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.


ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.


నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.


మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు.

ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు.  2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.


మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం  వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.


అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది.  ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!


ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.


రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.


అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు


చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.


అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.


ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.


CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.

అదే టాటా నానో పరిశ్రమ మోడీ  సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి.  అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.


https://www.google.com/amp/s/wap.business-standard.com/article-amp/companies/sanand-the-new-global-auto-hub-115032200818_1.html


మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని.


ఈ క్రింద ఫోటోలు చూడండి.  కుడి వైపు ఫోటో చైనా MNCలది. రెండోది US, యూరోప్ MNC లది.  స్వాతంత్రం వచ్చి 70 సం. లకు పైగా అయింది. ఎన్ని భారత్ కంపెనీలు పేర్లు దీనిలో ఉన్నాయో వెతకండి.


.....చాడా శాస్త్రి...



హంపీ పై పేరడీ పాట

 ఆ మధ్య హంపి వెళ్లి చూసినపుడు కలిగిన బాధానుభూతులే ఈ పేరడీ పాటకు ప్రేరణ :


అహో అంధ రాజా! ఓ క్రూర ముష్కర పాలకా! 

విజయనగర విధ్వంస కర్కశ కఠినాత్ముడా !

ఈ శిలలలో రుధిరాన్ని చిమ్మినావయా !


శిలలపై పంతాలు పట్టినారు

శిలలపై పంతాలు పట్టినారు

ముష్కరులు సృష్టి కే గునపాలు 

గుచ్చినారు ..ఊ..ఊ..       "శిలాలపై"


బండ గుండెల గల వారికైనా

బండ గుండెల గల వారికైనా

కరిగించి కన్నీరు తెప్పించగల వీటిపై

శిలలపై పంతాలు పట్టినారు...ఊ...ఊ..


ఒకవైపు ఉన్మాదమూక కవాతులు

ఒక పక్క మతమౌఢ్య వర్గశత్రువులూ

ఒకచెంప క్రూరాతి క్రూర ముఖాలు

ధ్వంస రచనచేయ నగరానికొచ్చారు

కనులు ఉండికూడా కబోదులయ్యారు

కనులు ఉండికూడా కబోదులయ్యారు

శిలల కంటే కూడా హీనమనిపించారు....శిలల


ఏకశిల రథమును భారిసుత్తులతోనా

తుత్తినియలు చేయ విఫలమైనారు

ఏకశిల రథమును భారిసుత్తులతోనా

తుత్తినియలు చేయ విఫలమైనారు


రాతి స్థంబాలచే రాక్షసత్వముతో

విలాపరాగాలు వినిపించుకున్నారు

వెతలు తీర్చెదన్న విరూపాక్ష సన్నిధిని

వెతలు తీర్చెదన్న విరూపాక్ష సన్నిధిని

విడవ కుండాకూడా విరిచేసేలాగా..

శిలలపై పంతాలు పట్టినారు ....ఊ.. ఊ..





బొమ్మలే విర్చినా కంబాలు కూల్చినా

కరములే నరికినా తలలు ఖండించినా

బెదరని చెదరని శిల్పాల వలనే

ఈ దేశ సంస్కృతి గళమెత్తి శిరమెత్తి

నిలిచి ఉండును సదా...నిజముగా..సనాతనా..


...చాడా శాస్త్రి...

మోడీని ఎందుకు అభిమానిస్తున్నావ్

 కొందరు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన మోడీని ఎందుకు వెనకేసుకు వస్తున్నావ్ అని అడుగుతున్నారు..

నేను మన స్టేట్ కి గత 60సం.ల బట్టి జరుగుతున్న అన్యాయం గురించి బాధపడుతున్నాను.
మీరందరు ఈ 13 జిల్లాలు 2014 తరువాత మాత్రమే కొత్తగా పుట్టినట్లు కాంగ్రెస్, తెదేపా ఈ 13 జిల్లాలను పూర్వం ఎప్పుడూ పాలించనట్లు మాట్లాడుతున్నారు.

ఉదా:
రాష్ట్రం విడిపోవడానికి, పోలవరానికి, కడప స్టీల్ ప్లాంట్ కి  రైల్వే జోన్ కి ఏమిటీ సంబంధం? అంటే రాష్ట్రం విడిపోక పోతే అవి మనకు అవసరం లేదా? మోడీ ఇప్పుడు అవి ఇవ్వలేదని గొడవ పెడుతున్నాం. అంత ముఖ్యమైనవి అయితే గత 30 సం.లుగా అవి ఎందుకు తెచ్చుకోలేకపోయారో  మనలని ఇంతకు ముందు పాలించిన పెద్దలు చెప్పవలసిన బాధ్యత లేదా?


అసలు ఎంతో సారవంతమైన  జిల్లాలు, పేరు ప్రఖ్యాతులు గాంచిన పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, సినిమా రంగం వాళ్ళు ఈ 13 జిల్లాలు వాళ్లే కదా?


50/60 సం.ల పాలన తరువాత మా జిల్లాలు వెనకబడి ఉన్నాయి, హైదరాబాద్ పోవడం తో అనాధలం అయిపోయాం స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని ముష్టి ఎత్తుకోవలసిన అవసరం ఏం వచ్చింది?
ఎవరు దీనికి కారకులు ?


70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్/తెదాపా లా? బీజేపీ నా?  వాళ్ల 70 ఏళ్ల తప్పులు కప్పి పుచ్చుకుందికి బీజేపీ ని తిడితే మనం స్వంత ఆలోచన లేకుండా తందాన తానా అంటున్నాం. మనకు 25 మంది.లోక్ సభ ఒక 10 మంది రాజ్యసభ ఎంపీ లు ఉంచుకొని
ఎవడో వెంకయ్య నాయుడు, ఇంకెవరో సుష్మ స్వరాజ్ మన రాష్ట్రానికి సంబంధించి ఇవి ఇవ్వండి అని పార్లమెంట్ లో ఎందుకు అడిగారు? మన వాళ్ళు ఏంచేస్తున్నారు ? 40 సం.ల అనుభవం ఉన్న రాష్ట్ర రాజకీయనాయకులు నిద్రపోయారా విభజన బిల్లు చదవకుండా?


బీజేపీ కి ఆంధ్రా తో ఉన్న సంబంధం ఏమిటి? ఎన్ని సార్లు ఎన్ని ఎంపీలను ఎమ్మెల్యేల ను ఎన్నుకున్నాం? వారిని తిట్టడానికి మనకు ఏ నైతిక హక్కు ఉంది.
మొన్న ఒక మీటింగ్ లో మన ముఖ్యమంత్రి గారు వేరే పార్టీనుండి వారి పార్టీలోకి మారిన ఎమ్మెల్యే తో ఏం అన్నారు? నువ్వు పూర్వం చాలా చేసిపెట్టమని నన్ను అడిగినా నువ్వు వేరే పార్టీలో ఉండడం చేత అవి నీకు అవి చేసి పెట్టలేదు అని చెప్పారు. 


ఎమెర్జెన్సీ తరువాత దేశం అంతా కాంగ్రెస్ ని ఒడిస్తే మనం గెలిపిస్తే తరువాత అధికారంలోకి వచ్చాక ఆంధ్రాకి కాంగ్రెస్ ప్రత్యేకంగా చేసిన సాయం ఏమిటీ  ?. 
2004 లో సోనియా ప్రభుత్వం ఏర్పడడానికి మన రాష్ట్రం పంపిన 32 ఎంపీలు ముఖ్య  కారణం కాదా? 
వాజపాయ్ చక్కని పాలన అందించినా బాబు గారి మీద  కోపంతో తెదేపాకి ఎంపీ సీట్లు రాకుండా తద్వారా వాజపాయ్ ని కేంద్రంలో అధికారంలోకి రాకుండా అవ్వడానికి మనం ఒక ముఖ్య కారణం కాదా?
కాంగ్రెస్ కి అంత సహాయం చేసిన మన ఆంధ్రాకి కాంగ్రెస్ 2014 వరకు 10 సం.ము లు అధికారం అనుభవించి చివరికి ఆఖరు సమయంలో ఆంధ్రా ఇబ్బందులు కనీసం పట్టించుకోకుండా రాష్ట్రం విడగొట్టలేదా?
ఇప్పుడు అదే కాంగ్రెస్ చాలా గొప్పది నమ్మండి అని ఎవడో వెధవ వాడి రాజకీయ స్వార్ధం కోసం చెపితే అవును గొప్పది
అని మళ్ళీ మనం పొగడటం లేదా?
పూర్వం కాంగ్రెస్ కానీ తెదేపా ఎప్పుడూ తెచ్చుకోలేనన్ని ప్రాజెక్టులు, విద్యాలయాలు నిదులు మోడీ ప్రభుత్వ హయాంలో గత 5 సం.లలో వచ్చాయి..మోడీకి విభజన బిల్లు 10 సం.ల సమయం ఇచ్చింది. కానీ 90% కి పైగా విభజన బిల్లులో అంశాలు మోడీ ప్రభుత్వం ఇచ్చింది..


మోడీ ఆంధ్రాకి ఏమి చేయలేదు అన్నవారు 2014 ముందు -


1. 24/7 కరెంటు ఉండేదా? లేదు. దేశంలో 24/7 కరంటు ఇవ్వడానికి కేంద్రము AP ని ముందు గా ఎన్నుకుంది


2. 2014 ముందు విభజన బిల్లులో పోలవరం 7 మండలాలు కలిపారా?
     లేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక  మొట్టమొదటి ఆర్డినెన్స్ ఇదే.


3. ఉద్యోగుల కోసం హైదరాబాద్ నుండి గుంటూరు ప్రత్యేక రైల్ నడపాలి అన్న ప్రస్తావన బిల్లులో ఉందా?
లేదు. కానీ ఆంధ్రా ప్రభుత్వం అడిగిన వెంటనే సాంక్షన్ చేశారు


4. రాజధానిలో భూములమ్ముకున్న రైతులకు కాపిటల్ గెయిన్స్ టాక్స్ ఎగ్జిమ్ప్షన్ ఇవ్వమని బిల్లులో ఉందా?
లేదు. అయినా కేంద్రం ఇచ్చింది. చాలా మంది రైతులకు లక్షల్లో మిగిలింది.


5. 2014 ముందు టీడీపీ కాంగ్రెస్ 60 సం.లు పై బడి పాలించారు కదా..ఆంధ్రాకి AIIMS గురించి.ప్రయత్నించారా?
లేదు. విభజన చట్టంలో 10 సం.ల సమయం ఇచ్చారు. కానీ 5 సం.ల.లోపే ప్రారంభించారు మోడీ ప్రభుత్వం.


6. 2014 ముందు టీడీపీ, కాంగ్రెస్ 60 సం.ల పై చిలుకు పాలించారు. ముఖ్య నగరాలైన గుంటూరు, విజయవాడ కి భూగర్భ డ్రైనేజ్ గురించి పని మొదలెట్టారా?
లేదు. మోడీ ప్రభుత్వం వచ్చాకే ఈ పనులు మొదలు అయ్యాయి.


7..2014 ముందు అసలు విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ ఎలా ఉండేవి. 
2014 తరువాత వాటిని స్మార్ట్ సిటీస్ గా గుర్తించాక ఇప్పుడు ఎలా ఉన్నాయి?


8. 2004-14 మధ్య 10 సం.లు కాంగ్రెస్ కేంద్రం లోనూ రాష్ట్రంలోనూ కూడా పాలించింది కదా! పోలవరం ఎందుకు పూర్తిచేయలేకపోయింది?
2014 ముందు వరకు ఎన్ని నిధులు వచ్చాయి. 2014-18 మధ్య ఎన్ని నిధులు వచ్చాయి


9. ఐఐఎం, ఐఐటీ, ఐఐఐటీ, గిరిజన యూనివర్సిటీ, మెరైన్ ఇన్స్టిట్యూట్, ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్, ఇలా సుమారు 20 విద్యా సంస్థలు కొన్ని విభజన బిల్లు లో లేనివి కూడా 2014 ముందు వుండేవా?
లేవు 2014 తరువాత మాత్రమే వచ్చాయి.


10. వీధుల్లో 2014 ముందు led దీపాలు వుండేవా? 
     లేవు. మోడీ ప్రభుత్వం వచ్చాకే ఇవి వచ్చాయి


11. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలు 2014 ముందు ఎలా ఉండేవి?
ఎన్ని విమానాలు ఉండేవి?2014 తరువాత ఇప్పుడు ఎలా ఉన్నాయి?

12. కోటిపల్లి -నరసాపురం రైల్వే లైన్ 60 సం.ల బట్టి పెండింగ్ లో ఉంది. మోడీ వచ్చాక పనులు మొదలు అయ్యాయి. 50% పైగా పనులు పూర్తి అయ్యాయి.


13. పిఠాపురం-కాకినాడ రోడ్డు వెడల్పు కార్యక్రమం దశాబ్దాల బట్టి పెండింగ్. మోడీ ప్రభుత్వం వచ్చాకే దానిని 4 లేన్లు గా పెంచి హై వే కింద పని పూర్తి చేశారు.


14. తెనాలి -విజయవాడ మూడో లైన్ లేక మద్రాస్ ట్రైన్స్ విజయవాడ వచ్చేవి, వెళ్ళేవి చాలా ఆలస్యం అయ్యేది. మోడీ ప్రభుత్వం వచ్చాకే లైన్ పని ప్రారంభించి పూర్తి చేశారు.


15. 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విశాఖ మెడ్ టెక్ సిటీ మోడీ ప్రభుత్వం వచ్చాకే ప్రారంభం జరిగింది.


16. అనంతపురం దగ్గర  కేంద్ర ప్రభుత్వ సంస్థ BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 750 కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభించింది.ఇది కూడా మోడీ ప్రభుత్వం వచ్చాకే.


17. కృష్ణ జిల్లాలో శ్రీహరికోటలాగా వెయ్యి కోట్ల ఖర్చుతో మరొక లాంచింగ్ పేడ్ DRDO వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. ఇది కూడా మోదీ ప్రభుత్వ హయాంలోనే.


18. పూర్వం ఎప్పుడైనా ఆంధ్రాలో ఒకే సారి కేంద్ర ప్రభుత్వం బీద వారికి ఇన్ని గృహాలు మంజూరు
చేసిందా ? సుమారు 7 లక్షల గృహాలు ఇచ్చింది.


19. UPA టైంలో 10 సం.లు పడుకున్న 6 వరుసలు నేషనల్ హైవే రణస్థలమ్-నరసన్నపేట 1500 కోట్ల ఖర్చుతో మోడీ ప్రభుత్వమే పని ప్రారంభించింది కదా!


20. మోడీ ప్రభుత్వం make in india అన్న తరువాతే కదా దేశంలో పరిశ్రమలు పెట్టడానికి వెంట వెంటనే క్లియరెన్స్ లు వస్తున్నాయి.పూర్వం ఒక్క ఎన్విరాన్మెంటల్ క్లియరన్స్ రావడానికే 2-3 సం.ల టైం పట్టేది. బోలెడు లంచాలు ఇవ్వవవలసి వచ్చేది..
ఈ Make In India కాన్సెప్ట్ వల్లే కదా మొబైల్ పరిశ్రమలు శ్రీ సిటీ.లో ప్రారంభం అయ్యాయి. కియా కూడా ప్లాంట్ పెట్టింది. తిరుపతిలో hardware పరిశ్రమలు తొందరగా ప్రారంభం అయ్యాయి..


21. క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ వసతులు రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు అయ్యాయి.


70 ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీ ఈ 13 జిల్లాల అధికారాన్ని  అనుభవించేసి తరువాత ఇప్పుడు సడన్ గా ఆంధ్రా వెనుకబాటు తనం గుర్తుకు వచ్చింది.
ఎదో కెసిఆర్ పుణ్యమా అని రాష్ట్రం విడగొట్టబట్టి మన టీడీపీ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికి అయినా ఉమ్మడి రాష్ట్రంలో ఈ 13 జిల్లాలు ఉన్న సంగతి గుర్తుకు వచ్చింది.


రాష్ట్రం విడిపోక ముందే పోలవరం 30 సం.ల ముందు అనుకున్నారు కదా..ఎందుకు పూర్తి చెయ్యలేదు? 
2014 లో రాష్ట్రం విడిపోతుంది. అప్పుడు బీజేపీ వస్తుంది నిధులు ఇస్తుంది అనుకోని ఆపేసారా? 
రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ తీసుకోండి. రాష్ట్రం విడిపోవడానికి వాటికి ఏమిటీ సంబంధం?  2003 లో రైల్వే జోన్ భువనేశ్వర్లో పెడుతున్నప్పుడు బాబుగారు NDA కన్వీనర్. ఆంధ్రా ముఖ్యమంత్రి. అది భువనేశ్వర్ లో పెట్టడం ఎందుకు ఆపలేదు? వైజాగ్ లో పెట్టడానికి ఎందుకు వత్తిడి తేలేదు. ఎందుకంటే అప్పుడు ఆంధ్రా అంటే బాబుగారికి హైదరాబాద్ మాత్రమే..  ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ కూడా వచ్చింది. వచ్చింది అని ఆనందించకుండా దానిలో కూడా లోపాలు వెతుకుతోంది తెలుగు మీడియా.
బీజేపీని విమర్శించేముందు 70 సం.లుగా మనలని పాలిస్తున్న మన టీడీపీ కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే లను చొక్కాలు పట్టుకు అడగండి మా 13 జిల్లాలని ఎందుకు పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలు నుంచి అని..
అయినా మోడీ నే తిడతాం. అంటే ..
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అని సామెత మనకు అక్షరాలా సరిపోతుంది.  అలా నమ్మించగలిగే తెలుగు మీడియా మనకి ఉంది.
అందుకే పచ్చ మీడియా మాయలో పడి స్వంత ఆలోచనను వదిలేసిన కొందరు మోడీని తిడుతున్న వాళ్ళను చూస్తే  జాలి వేస్తోంది తప్ప బాధ కలగడం లేదు.

మోడీ - మన్మోహన్ - డాలర్ ధర

 Chada Sastry  గారి వాల్ మీద నుండిమోడీ భారత ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసేస్తున్నాడు. రూపాయితో డాలర్ విలువ పడిపోతోంది అని రాహుల్ గాంధీ  గారు మిగతా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు.


ఒక సారి ఇది చూడండి..ఎవరు ఆర్ధిక వ్యవస్థ చక్కగా నడుపుతున్నారో? 


2008 డాలర్ విలువ ₹43.51ps ఉంటే అది 2014లో  మన్మోహన్ గారు దిగే సమయానికి ₹62.33ps చేరింది. అంటే  2008 నుండి 2014 మధ్య 6 సం.లలో డాలర్ తో రూపాయి విలువ  సుమారు ₹18.82 ps తగ్గిపోయింది.. 

అప్పుడు ప్రముఖ ఆర్ధిక వేత్త బాగా చదువుకున్న అపర ఆర్ధిక మేధావి మన్మోహన్ గారు ప్రధాని మరియు హార్వార్డ్ లో MBA  చదువుకున్న శ్రీ చిదంబరం గారు ఆర్ధిక మంత్రిగా వున్నారు..


అప్పుడు అంటే 2014 మోడీ ప్రభుత్వం వచ్చేసరికి విదేశీ మారక ద్రవ్య నిలువలు 

$304.20 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే 

₹22.80 లక్షల కోట్లు ఉన్నాయి. (ఒక$ 75రూ. చొ.)


సరే ! మరి 2014-2020 మధ్య 6 సం.లలో డాలర్ తో రూపాయి విలువ చూడండి.

2014 లో ₹62.33ps ఉంటే నేడు 10.01.2020 డాలర్ విలువ ₹73.38 ps ఉంది.

అంటే సుమారు ₹11.05ps మాత్రమే తగ్గింది.


ఇప్పుడు ఒక చదువు రాని చాయ్ వాలా ప్రధాని

విదేశీ చదువులు లేని సాధారణ గృహిణి ఆర్ధిక శాఖా మంత్రి.


ఇప్పుడు విదేశీ మారక ద్రవ్య నిలువలు

$541.62 బిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో చెప్పాలి అంటే ₹40.62 లక్షల (ఒక$ 75రూ. చొ.) కోట్లు ఉన్నాయి. అప్పటి కంటే సుమారు ₹18 లక్షల కోట్ల రూపాయల మేర విదేశీ మారక నిల్వలు పెరిగాయి. 


అందుచేత ఎవరైనా మోడీ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తున్నాడు అంటే గట్టిగా సమాధానం చెప్పండి.


DATA SOURCE : BookMyForex.Com