అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు పాక్షికంగా కానీ పూర్తిగా గాని ఎందుకు అమ్మాలి?
ఒక విశ్లేషణ ..
ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ప్రజల టాక్స్ సొమ్ములు ఖర్చు చేసి స్థాపిస్తారు. అలా పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వానికి తగిన ఆదాయం రావాలి. అంటే ఆ సంస్థలు సంపాదించిన ఆదాయంలో ఆ సంస్థల ఖర్చులు అంటే ఉద్యోగుల జీతాలు , విద్యుత్, నిర్వహణా ఖర్చులు పోనూ మిగతా ఆదాయం ప్రభుత్వానికి ఇస్తే ప్రజల టాక్స్ సొమ్ము దాని మీద ఖర్చు చేసినందుకు ఆ ప్రజలకు పరోక్షంగా ఆదాయం వచ్చినట్లు..అంటే అలా వచ్చే ఆదాయాల వల్ల ప్రభుత్వం ప్రజల మీద టాక్స్ భారం తక్కువ వేయవచ్చు లేదా ఆ డబ్బులు సంక్షేమ పథకాలకు, మౌలిక సదుపాయాల అంటే రోడ్లు విద్యుత్ మొ. వాటికి ఖర్చు చేయవచ్చు.
అలా కాక కనీసం ఆ సంస్థలు తమ ఖర్చులకు తగ్గ ఆదాయం ప్రతీ సం. సంపాదించగలిగితే ప్రభుత్వం స్థాపించిన సంస్థల వల్ల పోనీ ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా కనీసం కొంత మందికి ఉపాధి చూపిస్తున్నాయి అని సరి పెట్టుకోవచ్చు. అలాగ కూడా కాక ఆ ప్రభుత్వ సంస్థ ఆదాయం దాని ఖర్చులకు, జీతాలకు కూడా చాలకపోతే? మళ్లీ ప్రతీ సం. బడ్జెట్ నుండి అంటే ప్రజల దగ్గర వసూలు చేస్తున్న టాక్స్ మొత్తము లోంచి నిధులను ఈ సంస్థలను పోషించడానికి అంటే వాటి ఉద్యోగుల జీతాలకు ఇతర ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చెయ్యాలి. అంటే ఈ నిధులు వాటికి ఇవ్వడానికి కొత్త అప్పులు చేయడమో లేక ప్రజలపై టాక్స్ లు పెంచడమో కొత్త టాక్స్ లు వేయడమే చేయాలి. లేకపోతే ప్రభుత్వానికి మాత్రం వీటికి ఇవ్వడానికి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి?
ఇలా ఎన్ని సం.లు కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థలు నడవడానికి డబ్బులు సాయం చేస్తూ ఉండాలి? చెప్పలేం. కారణం మళ్ళీ ఆ సంస్థలు లాభాల బాట పట్టే దాకా చెయ్యాలి. ఎప్పుడు లాభాల బాట పడతాయి? అదీ చెప్పలేం అంతర్జాతీయ, దేశీయ ఆర్ధిక పరిస్థితులు, ఆ సంస్థ తయారు చేస్తున్న వస్తువులు/సేవల నాణ్యత, ప్రజల అవసరాలు, అభిరుచుల్లో మార్పు, టెక్నాలజీ లో మార్పులు ఇలా చాలా చాలా విషయాలు మీద ఆధార పడి ఉంటుంది.
ఎప్పటికి ఇక లాభాలు రాని సంస్థలను?
పూర్తిగా గాని పాక్షికంగా కానీ ఆ సంస్థ వాటాలు అమ్మి వాటి అప్పులు తీర్చి ఆ సంస్థను గాడిలో పెట్టడం. లేదా ఆ సంస్థలు ఇక గాడిలో పెట్టినా మారిన టెక్నాలజీ లేదా మార్కెట్ లేదా ప్రజల అవసరాల/అభిరుచుల మార్పుల దృష్ట్యా మళ్లీ ఒకటి రెండు సం. లలో ఆ సంస్థలు నష్టాల బాట పడతాయి అని అంచనా వేసినప్పుడు వాటిని ప్రభుత్వం పూర్తిగా అమ్మి ఆ డబ్బులు ఏవైనా లాభదాయకంగా కొత్త సంస్థలలో మదుపు చేరడం చేయవచ్చు. దాని వల్ల ప్రభుత్వానికి అనవసర ఖర్చు తగ్గడమే కాక ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
1999లో వాజపేయి గారు ప్రధానిగా వచ్చేసరికి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. చాలా సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. గతంలోనే కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ సంస్థ(SAIL) స్టీల్ అథారిటీ ఇండియాలో కొంత భాగం అమ్మినా షేర్ మార్కెట్ లో ఆ షేర్ కొన్న మదుపుదారులు లాభపడకపోగా నష్టపోయారు.
అదే టైం లో వాజపేయి గారి ప్రభుత్వం వచ్చింది. వారు హిందూస్తాన్ జింక్, మారుతి లో కొంత వాటా అమ్మకానికి పెట్టారు. స్టాక్ మార్కెట్ లో ఆ షేర్లు కొన్న మదుపర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ కంపిణీలలో ఉన్న ప్రభుత్వ వాటా చాలా ఎక్కువ పెరిగింది. ఇలా పబ్లిక్ సంస్థ షేర్స్ మంచి లాభాలు ఇవ్వడంతో అదే నమ్మకంతో మదుపరులు అప్పటికే స్టాక్ మార్కెట్ లో గల మిగతా పబ్లిక్ సెక్టర్ షేర్లు అంటే సెయిల్ వంటివి కొనడం ప్రారంభించారు. దానితో పబ్లిక్ సెక్టర్ సంస్థల షేర్ల విలువ, తద్వారా ఆ సంస్థల మొత్తం విలువ పెరగడం ప్రారంభం అయింది.
స్టాక్ మార్కెట్ మదుపరులకు లాభాలు తెచ్చి పెడుతోందా? నష్టాలు తెచ్చిపెడుతోందా? అని కొలవడానికి రక రకాల పద్దతులు అనుసరిస్తారు. వాటిల్లో ఒకటి వర్గాల వారీగా షేర్లు విభజించి అంటే బాంక్ ల షేర్లు(బాంక్ ఇండెక్స్ అంటారు), లోహాల షేర్లు, ఫార్మా షేర్లు, ఐటి షేర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు షేర్లు ఇలా విడగొట్టి చూసి ఏ వర్గ షేర్లు ఎంత మేర మదుపరులకు లాభాల్ని సంపాదించి పెడుతున్నాయో చెప్తారు. అంతేకాక బాంబే స్టాక్ ఎక్స్చేంజి లో ముఖ్యమైన 500 షేర్లు తీసుకొని ఆ గ్రూప్ పనితనాన్ని అంచనా వేస్తారు. దానినే BSE500 ఇండెక్స్ అంటారు. ఇది మొత్తం బాంబే స్టాక్ ఎక్స్చేంజి పని తీరుని కొలిచే కొలబద్ధగా చెప్పుకుంటారు.
ఈ ఉపోద్ఘాతం ఎందుకు అంటే 1999-2004 మధ్య వాజపేయి ప్రభుత్వం ఉండగా ఈ BSE 500 ఇండెక్స్ 70% పెరిగింది అంటే మదుపరులకు 70%లాభాలు ఇచ్చింది. కానీ అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు షేర్ ఇండెక్స్ 300% పెరిగింది. అంటే 1999లో ఒకరు మిగతా షేర్లు లో ఒక వెయ్యి రు.పెడితే 2004కి అతనికి ఆ వెయ్యి ₹1700 అయింది. కానీ అదే వెయ్యి అతను PSU షేర్స్ లో పెట్టి ఉంటే ₹3000 అయ్యింది. అంటే వాజపేయి సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పనితీరు మీద మదుపరులకు బాగా విశ్వాసం పెరిగింది అన్న మాట.
సరే ! 2004 లో పెద్దగా చదువు లేని వాజపేయి గారు దిగి పోయి గొప్పగా ఆర్థిక శాస్త్రము చదివిన, ఇంతకు ముందే దాదాపు అన్ని ప్రభుత్వ అత్యుత్తమ ఆర్ధిక పదవుల్లో పని చేసిన అనుభవం గల మన్మోహన్ గారు ప్రధాని గా అయ్యారు. అదే PSU షేర్లు పరిస్థితి చూడండి. UPA-1 కాలంలో BSE 500 ఇండెక్స్ 120% లాభాలు ఇస్తే PSU ఇండెక్స్ 60%మాత్రమే లాభాలు ఇచ్చింది. అదే UPA-2 లో పరిస్థితి మరీ ఘోరం. మన్మోహన్ ప్రభుత్వం మరిన్ని అంటే సుమారు 30 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు అమ్మినా (మోడీ అన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తున్నాడు అనే ఆరోపణలు పై మరియు మన్మోహన్ అమ్మేసిన సంస్థలు ఈ రెండింటి సమాచారం తో నేను వేరే పోస్ట్ పెడతాను) PSU ఇండెక్స్ లాభాలు ఇవ్వకపోగా 6% నష్టాలు మిగిలిచింది మదుపరులకు. కానీ BSE500 ఇండెక్స్ 73%లాభాలు పంచి ఇచ్చింది. అంటే 2009 లో ఒకరు BSE500 ప్రకారం వెయ్యి మదుపు మీద 2014 సరికి ₹1730 అయితే, PSU ఇండెక్స్ లో 2009 లో పెట్టిన వెయ్యి 2014 కి ₹940 అయిపోయింది. అంటే ప్రభుత్వ సంస్థల షేర్లు విలువ, మొత్తం మార్కెట్ విలువ పెరగక పోగా తగ్గిపోయింది అని అర్ధం.
అందుకే 2014 తరువాత ఈ PSU షేర్ల విలువ ఇంకా ఇంకా తగ్గిపోతూ వస్తోంది. ఈ 6 సం.లలో PSU ఇండెక్స్ 36%పడిపోయింది.
మరి దీని వల్ల ఏమిటి నష్టం? షేర్ మార్కెట్ లో మదుపుదారులు ఏ సంస్థ షేర్అయినా లాభాలు తెస్తుంది అనే నమ్మకం ఉంటేనే షేర్లు కొంటారు. లేకపోతే కొనరు. అంటే మోడీ ప్రభుత్వం ఒక వేళ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొంత శాతం వాటాలు అమ్ముదాం అనుకుంటే మార్కెట్ లో ఆ షేర్స్ కొనే వాళ్ళు లేక షేర్ కి విలువ పెరగదు. ప్రభుత్వం డిజ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అంటే ప్రభుత్వ సంస్థలలో కొంత వాటా అమ్మి డబ్బు సంపాదించి ఆ సంస్థలను తిరిగి లాభాల బాటలో పెట్టాలి అన్నా లేదా పూర్హిగా అమ్మి నష్టాలు తగించుకోవాలి అనే ప్రణాళికలు అమలుకు నోచుకోవు. అంతే కాక ఈ ప్రభుత్వ సంస్థల మార్కెట్ విలువ కూడా తగ్గిపోతుంది
అందువల్ల మోడీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ వాటాలు అమ్మి నష్టాల నుండి కొన్నింటిని కొంత బయట పడేద్దాం అని ప్రణాళికలు వేసుకున్నా అమలు చేయలేకపోతున్నాది. ఎందుకంటే షేర్ మార్కెట్ లో ఈ షేర్లు అంటే పెద్దగా ఆసక్తి ఉండకపోవడంతో మదుపరులు ఈ షేర్స్ పెద్ద మొత్తంలో కొనరు, ప్రభుత్వానికి డబ్బులు రావు, డబ్బులు వస్తే కాస్త బాగున్న సంస్థల వంటి వాటిని (అంటే LIC, BPCL వంటివి)మళ్ళీ గాడిలో పెట్టి , మార్కెట్ లో ఈ షేర్ కోట్ అవుతుంది కాబట్టి సంస్థలో/ఉద్యోగుల్లో పోటీ తత్వం పెంచవచ్చు..
కానీ మదుపరులు ఇలా కాస్త లాభంగా ఉన్న షేర్లు పైనే ఆసక్తి చూపిస్తారు కానీ నష్టాలు వస్తున్న సంస్థల షేర్లపై ఆసక్తి చూపరు. అందుకే ప్రభుత్వం కాస్తా లాభాలు సంపాదిస్తూ ఉన్న సంస్థలలోనే తన వాటా పాక్షికంగా కానీ పూర్తిగా గాని అమ్మడానికి ప్రయత్నించగలదు. నష్టాల్లో ఉన్న సంస్థల షేర్లు ప్రీమియం పెట్టి అమ్మే అవకాశం ఉండదు. ఎందుకంటే వాటిని కొనడానికి ఎవరూ ఆసక్తి చూపించరు కాబట్టి. పోనీ ఆ షేర్లు తక్కువ ధరకు అమ్మితే మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతోంది అని అప్రతిష్ట మూట కట్టుకుంటుంది
అందువల్ల ఈ డిజ్ ఇన్వెస్ట్మెంట్ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు అమ్మడం అన్న ప్రక్రియ ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పి. పోని అలాగే నష్టాల్లో నడిపిద్దాం అంటే తెల్ల ఏనుగును భరిస్తున్నట్ల ఎన్ని సంవత్సరాలు భరించగలదు?
మోడీ ప్రభుత్వం మళ్ళీ లాభాల్లో ఉన్న కొన్ని ప్రభుత్వ సంస్థల షేర్లు పాక్షికంగా అమ్ముదాం అని నిర్ణయం తీసుకోవడంతో ఈ ఫిబ్రవరి నెలలో PSU ఇండెక్స్ 42% వృద్ది నమోదు చేసుకున్నాయి. అందుకే మార్కెట్ ఇలా పాజిటివ్ గా ఉన్నప్పుడే ప్రభుత్వం PSU షేర్లు అమ్మగలదు.
....చాడా శాస్త్రి....